బక్క సిక్కిన సన్నకారు రైతన్నా, ఆశపడవా తొలకరి సినుకుకై
నడి సంద్రాన గంగ పుత్రులా, ఈదగలరా ఆ సినుకు ఉప్పెనకు
దట్టపు చీకటిని కమ్మిన పుడమి, చీల్చడా భానుడి కిరణాలు
గూడు చెదిరిన గిరిజనుడా, దోమ కాటుకు దక్కేనా నీ పానం
పుత్తడి వెలుగుల పసి బిడ్డడా, తడబడినా అడుగు నిలపగలవా
కూడు బాట నడిసిన బతుకు జీవుడా, చేరేవా నీ గమ్యం ఆకలి కడుపున
పానాలు నిలిపే వైద్యుడా, కుదిరేనా కాసంత కునుకు
పెను గాలికి చిక్కి నలిగిన పావురమా, చేరునా నీ రెక్కలు గగనపు అంచులు
సంద్రపు కెరటాల ఓ కాలమా…. ఎదురీడే ఈ భవిత గమనము ఆగదు.