ఆ క్షణాలు,
విజయోత్సాహంలో ఒక ఉప్పెనలా వెల్లువెత్తిన అపురూప క్షణాలు
ఆ క్షణాలు,
నిరాశతో నడిచే చోట,విజయగర్వంతో పరిగెడిన క్షణాలు
ఆ క్షణాలు,
మాటలు రాని మౌనం,జూలు విదిల్చి సింహంలా ఘర్జించిన క్షణాలు
ఆ క్షణాలు,
హృదయపు లోతున భావాలు,సంద్రపు అలలవలే ఉప్పొంగిన క్షణాలు
ఆ క్షణాలు,
అలుపెరుగని నిరీక్షణ,ఒక చిచ్చుకి మసిగా మారినా క్షణాలు
ఆ క్షణాలు,
స్వార్ధం లేని విశ్వాసం,సప్తవర్ణాలుగా నింగిన అవతరించిన క్షణాలు
ఆ క్షణాలు,
వంచనతో నీరసించిన కనులు,వేయి దివ్వెల ప్రకాశంతో ప్రజ్వలించిన క్షణాలు
ఆ క్షణాలు,
చులకనైన చేతలకు,చెదలు పట్టిన చెరలకు చరమగీతం పాడిన క్షణాలు
ఆ క్షణాలు,
చరిత కాదని నలువైపులూ హడలేలా నవశాకానికి నాంది పలికిన క్షణాలు
ఆ క్షణాలు,
ఒంటరితనం ఓటమికి భయపడక ఎదురొడ్డి ఎదురించిన క్షణాలు
ఆ క్షణాలు,
మహా విప్లవానికి సమర శంఖారావం పూరించి,మరో చరితని సువర్ణాక్షరాలతో లిఖించిన క్షణాలు
ఆ క్షణాలు,
వెటకారపు విసుర్లు,వేటు మీద వేటు వేడికి ఆవిరైన క్షణాలు
ఆ క్షణాలు,
నవ శకం కదిలిరాగా,నిలువెత్తు నిజాయితీకి నీరాజనం పలికిన క్షణాలు
ఆ క్షణాలు,
కలలో మెదిలి,ధ్రువతారలా నింగిన వెలిసి చిరస్థాయికి చేరిన క్షణాలు
ఆ క్షణాలు,
అచంచలమైన ఆనందం పరవళ్ళు తొక్కిన క్షణాలు
ఆ క్షణాలు,
ఆకలిదప్పులు తీర్చి కొత్త ఆశ,ఉత్సాహం చిగురించిన క్షణాలు
ఆ క్షణాలు,
మరువలేక మిగిలి,మరల మరల మెదలిన క్షణాలు
ఆ క్షణాలు,
నా కలానికి కొత్త ఉత్తేజం నింపి ,అపురూప జ్ఞాపకాలుగా మారిన క్షణాలు …………………………