ఎన్నో ఏళ్ళ నుండి ప్రపంచ దేశాలన్నీ చుట్టేయాలని బలమైన కోరిక ఉండేది. కానీ ఇప్పటివరకు దేశం బయటికి అడుగు పెట్టలేదనే ఆవేదన, కల నిజమవ్వాలని నిరీక్షణ మనసును కలచివేస్తున్నాయ్. ఒక చిన్న దానితోనైనా మొదలు పెడదామని వెతుకుతుంటే దొరికింది ఈ వియత్నాం. భౌగోళిక భిన్నత్వం, గొప్ప చరిత్ర మరియు అపూర్వమైన సాంస్కృతిక వారసత్వం వియత్నాం సొంతం. పొడవైన సముద్ర తీరం, సొగసరి కాలువలు, అబ్బుర పరిచే గుహలు, చల్లటి పర్వత శ్రేణులు అన్నీ కలగలిసిన భూతల స్వర్గం. హనోయి నగరం లోని ఇరుకైన సందుల నుండి హో చి మిన్ నగరంలోని ఆకాశహర్మ్యాలు పేదరికానికి ఐశ్వర్యానికి ప్రాంతీయతకు ప్రపంచీకరణకు నిదర్శనంలా నిలిచాయి.
Day 0
వియత్నాం వెళ్ళడానికి ముంబై, కలకత్తా మరియు కొచ్జి నుండి నేరుగా విమానాలు ఉన్నాయ్. కానీ దూరాభారం, విమానాల ధరలరీత్యా మేము హైదరాబాద్ నుండి కులాలంపూర్ మీదుగా ఎయిర్ ఆసియా విమానం చేసుకున్నాం. మలేషియా లోని కులాలంపూర్ ముఖ్యమైన విమానస్థావరంగా వీరు ఆగ్నేయాసియా దేశాలకు చౌకధరల విమానాలు నడుపుతూ ప్రసిద్ధి చెందారు. మొట్టమొదటి విదేశ యాత్రకు ఉత్సాహంతో విమానాశ్రయానికి ముందుగానే చేరుకొని అన్ని లాంఛనాలు ముగించి సమయానికి పయనమయ్యాం.
Day 1
నాలుగు గంటల ప్రయాణం తర్వాత సూర్యోదయానికి మలేషియా దేశంలో అడుగుపెట్టాం. మా తదుపరి విమానానికి రెండు గంటల సమయమే ఉండటంతో హడావిడిగా వెళ్లాల్సి వచ్చింది (విమానం మారాల్సిన అనుభవం ఇంతకు ముందు లేకపోవడం తోడయి). చాలా దూరం నడిచిన తర్వాత మొత్తానికి తదుపరి విమానం వద్దకు చేరుకున్నాం. కొంచెం అల్పాహారం కోసం వెతకగా రాబోయే కొన్ని రోజులు ఎలా ఉండబోతున్నాయో మాకు అర్ధం అయ్యింది. ఒకప్పుడు సైగాన్ నగరంగా పిలవబడిన హో చి మిన్ నగరానికి మా ప్రయాణం మొదలుపెట్టాం. ఇది వియత్నాం దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం. ముందరి విమానంతో పోల్చుకుంటే ఈ విమానంలో భారతీయులు చాలా అరుదుగా కనిపించారు. రెండు గంటల విమానయానం తరువాత తాన్ సన్ న్యత్అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాం. ఆ విమాన పరిసరాలు చూసాక ఈ దేశం మీద మాకున్న అనుమానాలు అపోహలన్నీ తీరిపోయాయి. మన దేశంలోని మహా నగరాలకు తీసిపోని విధంగా ఉంది.
మాతో తెచ్చుకున్న డాలర్లను వియత్నమీస్ డాంగ్ కు మార్చుకున్నాం. మన ఒక రూపాయికి సుమారు 290 డాంగ్ లు.దేశమంతా విస్తరించి ఉండడంతో ఒక విఎట్టెల్ సిమ్ కార్డు విమానాశ్రయంలోనే తీసుకున్నాం. అక్కడ నుండి గ్రాబ్ టాక్సీ చేసుకుని మా హోటల్ కి బయలుదేరాం. అక్కడి క్యాబ్ డ్రైవర్లు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనకి అర్ధం కాకపోయినా ఒక ఫోటో తీసి పెట్టినా చాలు. అంతే కాక గ్రాబ్ యాప్ లో ఆంగ్లంలోకి అనువాదం కూడా ఉంది. ఇది ఆగ్నేయాసియాలో టాక్సీలకి,ద్విచక్ర వాహనాలకు మరియు కొరియర్ లాంటి అన్ని అవసరాలకు పేరు పొందింది. అక్కడి క్యాబ్ డ్రైవర్లు చాలా మర్యాదగా ఉన్నారు.

సైగాన్ నగరమంతా ద్విచక్ర వాహనాలు మరియు కొరియన్, జపనీయుల కార్లతో నిండి ఉంది. ఎక్కడ చూసినా విలాసవంతమైన కార్లు. బెంగళూరుకి ఏ మాత్రం తీసిపోని ట్రాఫిక్. కాకపోతే రోడ్ల మీద కార్లు కంటే ద్విచక్ర వాహనాలు అధికం మరియు ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. డిస్ట్రిక్ట్ వన్ అనే ప్రాంతం కళకళలాడుతూ ఉంటది. మా హోటల్ కూడా అందులో చిన్న వరుస లో ఉన్నది. ఎనిమిది కిలోమీటర్లు అరగంట పైనే పట్టింది. మా చెకిన్ సమయానికంటే ముందే వెళ్లడంతో తినడానికి ఆలా బయటికి వెళ్ళాం. ఆ ప్రదేశం అంతా బహుళజాతి దుకాణాలు మరియు రెస్టారెంట్లతో నిండి ఉంది. ముందు మన భారతీయ హోటల్స్ కోసం వెతికినా బాగా అలిసి పోవడంతో మెక్ డొనాల్డ్స్ తో సరిపెట్టున్నాం. మేము అనుకున్నంత బాగా లేకపోయినా ఆకలి వలన కడుపు నింపుకున్నాం. వియత్నాం రెస్టారెంట్లలో మరియు హోటళ్లలో ఎక్కడికి వెళ్లిన ఉచితంగా వైఫై లభిస్తుంది. ఈ నగరంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ డిస్ట్రిక్ట్ వన్ దగ్గర్లోనే నడిచి వెళ్లేలా ఉంటాయి.
సైగాన్ నగరంలో మా మొదటి మజిలీ ఇండిపెండెన్స్ ప్యాలస్. ఇది వియత్నాం యుద్ధం ముగింపుకి చిహ్నం.అక్కడికి పక్కనే ఏప్రిల్ 30 అనే ఒక పార్కు ఎత్తైన వృక్షాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ తరువాత మేము కొంచెం దూరంలో ఉన్న సైగాన్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్‌కు వెళ్ళాం. 19వ శతాబ్దం కాలం నాటి ఈ కట్టడం పర్యాటకులకు ప్రసిద్ధి. లోపలికి అడుగు పెట్టగానే ఒకప్పటి రాష్ట్రపతి హో చి మిన్ భారీ చిత్రపటం దర్శనమిస్తుంది. వియత్నాం వాసులకి వీరంటే ఎంతో గౌరవం మరియు గర్వంగా చెప్పుకుంటారు. ఈ తపాలా కేంద్రం ఇప్పటికీ ఎన్నో ఉత్తరాలను వాటి గమ్యాలకు చేరుస్తా ఉంది. కొంత భాగంలో దుకాణాలు ఉన్నాయి. ఈ తపాలా కేంద్రానికి ఎదురుగా నోట్ర డాం చర్చి కూడా ప్రసిద్ధి. కానీ పర్యాటకులను అనుమతించలేదు. వియత్నాం దేశంలో అధిక భాగం ప్రజలు ఎటువంటి మతాన్ని ఆచరించరు. చైనా సిద్ధాంతాలైన కన్ఫ్యూషనిజం మరియు టావోయిజంల స్పూర్తితో వారి ఆచారాలు పాటిస్తారు. అవే కాకుండా బౌద్ధం మరియు క్రైస్తవ మతాలు కొంత వరకు ఆచరిస్తారు.





వియత్నాంలో ఎక్కువగా పండించే రాబస్తా గింజల నుండి తయారు చేసిన కాఫీ హో చి మిన్ నగరంలో అడుగడుగునా కనిపిస్తుంది. మన దేశంలో దొరికే అరబికా కాఫీతో పోల్చుకుంటే చాలా చేదుగా ఉంటది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ప్రమాదం అని చెప్తారు. అలా ఆ వీధులలో తిరుగుతా ఒక కేఫ్ కు చేరుకున్నాం. అక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉంది. కొందరు చదువుకుంటుంటే ఇంకొందరు చిత్ర లేఖనం అలా చేస్తా అక్కడే చాలా సమయం గడుపుతున్నారు. ఆ తరువాత అక్కడ పేరు పొందిన బెన్ థన్ మార్కెట్ కు వెళ్ళాం. చాలా చాకచక్యంగా బేరం ఆడకపోతే మోసపోయినట్లే. ఆకలిగా ఉన్న మాకు ఎదురుగా హవేలీ అనే ఒక భారతీయ రెస్టారెంట్ కనిపించింది. వియత్నాం లో మాకు దొరికిన రుచికరమైన ఆహారం మాత్రం ఇక్కడే.


Day 2
ఉదయం లేవగానే అలా అల్పాహారం కోసం బయటికి వచ్చా. ప్రొద్దునే వియత్నమీస్ ఆహారం మాత్రమే దొరుకుతుంది. ఇక చేసేది ఏమి లేక సూపర్ మార్కెట్‌కి వెళ్లి ఇన్స్టంట్ నూడుల్స్, పాలు మరియు చాక్లేట్లుతో సరిపెట్టుకున్నాం. అక్కడ కొనేటప్పుడు శాఖాహారులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజుకి మా మొదటి మజిలీ కూ చి సొరంగాలు. ముందుగానే మేము చౌక ధరకి క్లూక్ లో బుక్ చేసుకున్నాం. వారు చెప్పిన సమయానికి ఖచ్చితంగా మన హోటల్ వద్దకే వచ్చి తీసుకువెళ్తారు.
అమెరికా చరిత్ర లేదా ప్రచ్ఛన్న యుద్ధం గురించి చదివిన వారికి వియత్నాం యుద్ధం ఎంత కీలక ఘట్టమో విదితమే. అగ్ర రాజ్యమైన అమెరికాను ఒక చిన్న ఆసియా దేశము ఎలా ఓడించిందో తెలిసినదే. వియత్నాం కాలక్రమంలో జపనీయులు, ఫ్రెంచ్ వారు మరియు అమెరికన్లను ఎదురుకోవాల్సి వచ్చింది. అప్పట్లో కాబోయే రాష్ట్రపతి హో చి మిన్ దళానికి, మొదటగా అమెరికానే జపనీయుల పైన పోరాడడానికి మరియు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా సైనిక శిక్షణ ఇచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత హో చి మిన్ తన దేశాన్ని కమ్యూనిజం వైపు నడిపించడం అమెరికాకు ఏ మాత్రం విరుగుడు పడలేదు.ఆ తరువాత దేశం రెండు ముక్కలైంది. ఉత్తర వియత్నాం కమ్యూనిస్ట్ దేశంగా, చైనా మరియు రష్యా అండదండలతో వియెట్ కాంగ్ ప్రభుత్వంగా అవతరించింది. హో చి మిన్ దానికి నాయకత్వం వహించారు. దక్షిణ వియత్నాం పెట్టుబడిదారీ దేశాల అండగా ప్రభుత్వం స్థాపించింది.
కూ చి సొరంగాలు మొదటగా ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా అక్కడి వారు స్థావరాలుగా చేసుకుని ఉండేవారు. ఆ తరువాత వియత్నాం యుద్ధం సమయంలో వియెట్ కాంగ్ వారు దక్షిణ వియత్నాంకి వ్యతిరేకంగా ఇక్కడే తలదాచుకునే వారు. ఇది వందల కిలోమీటర్లు విస్తరించి ఎన్నో గ్రామాలను కలుపుతూ సమాచార సాధనంగా ,ఆహారం, ఆయుధాలు నిలువ చేసుకోడానికి మరియు సైనికులు నివసించేవారు. అమెరికా సైనికుల ఊహకు అందని ఈ సొరంగాలు వారిని తర్జన భర్జన చేసేలా అక్కడక్కడా ఉచ్చులతో చిక్కుకుపోయేలా ముచ్చమటలు పట్టించాయి. భూమి కింద బహుళ దశలతో నీటి వనరులు, గాలి మార్గములు మరియు వంటగదులు కూడా ఉండేవి. ఆ వంటగది నుండి వచ్చే పొగ భూమి పైకి ఎత్తుకు లేవకుండా ఒక గదిలో భద్రపరిచి అది తివాచీలా ఏర్పడేలా చేసేవారు. దానితో శత్రువులు వీరి జాడ పసిగట్టడం చాలా కష్టంగా ఉండేది.
ఆ సొరంగాలు మార్గమధ్యలో లక్క పెయింటింగ్ పరిశ్రమ వద్ద ఆపారు. వియత్నాం యుద్ధం సమయంలో అక్కడి అడవులను తుడిచి వెయ్యటానికి అమెరికన్లు ఏజెంట్ ఆరంజ్ అనే హానికరమైన కలుపు మందును వాడారు. దాని వలన అడవి నాశనం అవ్వడమే కాకుండా ఆ తరువాత వచ్చిన మూడు తరాలు జన్యుపరమైన లోపాలతో వికలాంగులుగా మిగిలిపోయారు. వారే ఈ పరిశ్రమని నడుపుతున్నారు. కోడి గుడ్డు పెంకు వాడి చాలా నైపుణ్యంగా రోజులు తరబడి ఈ పెయింటింగ్‌లకు ప్రాణం పోస్తున్నారు. అక్కడి నుంచి సొరంగాల వద్దకు చేరుకున్నాం. అమెరికన్లు వాడిన విమానాలు మరియు ట్యాంకీలు అక్కడ ప్రదర్శనగా ఉంచారు. చిన్న మ్యూసియంతో పాటు వాటి గురించి ఒక ప్రదర్శన. ఆ సొరంగాల లోపలి మమ్మల్ని తీసుకు వెళ్లారు. పర్యటకుల కోసం వాటిని కొంచెం పెద్దవిగా చేసారు కానీ చాలా కష్టం మీద వెళ్లాల్సి వచ్చింది. కొంత మంది ఒకట్రెండు చూసేసరికి చేతులు ఎత్తేసారు. అప్పుడు నాకు ఏమీ అనిపించకపోయినా ఆ తర్వాత రోజులు నొప్పితో నరకం కనపడింది. మా అదృష్టం కొద్దీ మా పర్యటన ముగిసిన వెంటనే జోరుగా వర్షం మొదలైంది.







ఎక్కువ సమయం లేకపోవడంతో మేము మెకాంగ్ డెల్టాను చూడలేకపోయాం. నగరానికి తిరిగివచ్చాక భోజనం చేసి విమానాశ్రయానికి బయలుదేరాం. మా తదుపరి ప్రయాణం మధ్య వియత్నాం లో ఉన్న ద నాంగ్ నగరం. వర్షం కారణంగా ఒక గంట ఆలస్యంగా వియెట్ జెట్ విమానంలో బయలుదేరాం. మేము ద నాంగ్ నగరం చేసుకునేసరికి బాగా ఆలస్యం అయిపోయింది. మేము సముద్ర తీరానికి దగ్గర్లో ఉన్న దానా మెరీనా హోటల్లో చేసుకున్నాం. ఎంతో అందంగా ఉన్న డ్రాగన్ వంతెనను దాటుకుంటూ మా హోటల్‌కు చేరుకున్నాం. ఆలస్యం అవ్వడంతో ముందుగానే గ్రాబ్ ద్వారా ఆహారం హోటల్ వద్దకే తెప్పించుకున్నాం. అలా రోజు ముగిసింది.

Day 3
ఉదయం లేవగానే తప్పేదేమీ లేక ఇన్స్టంట్ నూడుల్స్ తిని ఈరోజు వెళ్ళవలసిన బానా హిల్స్ కు సిద్ధమయ్యాం. మా హోటల్ నుంచి చాలా దగ్గర్లో కనిపించేలా మై కే బీచ్ ఉన్నా సమయం లేకపోవడంతో వెళ్లలేకపోయాం. ద నాంగ్ నగరానికి 40 నిమిషాల దూరంలో ఉన్న ఈ బానా హిల్స్ అనే హిల్ స్టేషన్ ను ఫ్రెంచ్ వారు కనిపెట్టి సేద తీరడానికి అభివృద్ధి చేశారు. అక్కడికి చేరుకోగానే మాకు ప్రపంచంలోనే పొడవాటి నాన్-స్టాప్ కేబుల్ కార్ దర్శనమిచ్చింది. అందులోనూ మాకిది మొదటి అనుభవం. పొగమంచుల దుప్పటిలో కప్పి ఉన్న లోయల నడుమ చిరుజల్లు కురవగా ఆ చిత్తరువు మా మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆ కేబుల్ కార్లో అరగంట ప్రయాణం తర్వాత మొదటగా మేము ప్రపంచమంతా పేరు పొందిన గోల్డెన్ బ్రిడ్జి చేరుకున్నాం. అంతర్జాలంలో చూసినట్లుగానే అద్భుతంగా ఉంది. దానికి తోడు పొగ మంచు, చిరు జల్లులు వాతావరణాన్ని మనోహరంగా చేసాయి. అక్కడ నుంచి పూల ఉద్యానవనం ఇంకా ముందుకు వెళ్తే భౌద్ధ మందిరం ఉంది. ఎతైన బుద్ధుని విగ్రహం ఆ వాతావరణంలో మనసును హత్తుకునేలా ప్రశాంతతను కల్పించింది.








అక్కడ నుండి ఇంకో కేబుల్ కార్ తీసుకుని ఫ్రెంచ్ టౌన్ చేరుకున్నాం. అక్కడ మా మొట్టమొదటి 5d చలనచిత్రం చూశాం. వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికతతో ఒక పక్షి లాగా ప్రపంచ వింతలన్నీ చూడకలిగాం. ఫ్రెంచ్ వాస్తు శిల్పాకళా సంపద కన్నుల విందులా ఉన్నది. ఐరోపా దేశానికి వచ్చామా అన్నట్లు ఆ కట్టడాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయి. అక్కడ భోజనం మాత్రం నిరాశ చెందేలా చేసింది. చాలా దూరం నడవాల్సి వచ్చింది. భారతీయ శాఖాహారులకి తినడానికి చాలా అరుదుగా ఉన్నాయి. ఇక ద నాంగ్ నగరానికి తిరిగి వెళ్లే సమయం కొంచెం ఉండడంతో ఆలా అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాం. ముందుగా మేము అనుకున్న ప్రకారం హోయ్ అన్ నగరం చూడడానికి సమయం ఉండదు అనుకున్నాం. కానీ మా తోటి పర్యాటకుల సలహా విన్నాక సాయంత్రం అక్కడికి వెళ్దాం అని నిశ్చయించుకున్నాం.






హోయ్ ఆన్ నగరం అక్కడ నుండి సుమారు గంటన్నర పట్టింది. మా హోటల్ వారి సహాయంతో వెళ్లి రావడానికి క్యాబ్ చేసుకున్నాం. ముందు సమయం కుదరక వెళ్లలేకపోతున్నాం అనే బాధ ఉండేది. కానీ చివరగా ఎలాగైనా వెళ్తున్నాం అని తెలిసి సంతోష పడ్డాం. అందమైన మార్కెట్ దాటుతూ ఆ కాలువల వైపు వెళ్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఆ పడవలలో దీపపు కాంతులు కనపడగానే ఒక అద్భుతమైన చిత్రకారుని కుంచె నుండి రాలిన అమూల్య చిత్రమలే అనిపించింది. అక్కడ పడవలో ఒక 20 నిమిషాలు అలా ఆ కాంతుల మధ్య సేద తీరాం. ఆ తర్వాత ద నాంగ్ నగరానికి డ్రాగన్ ఫైర్ అండ్ వాటర్ షో కి వెళ్ళాం. ఇది శుక్ర,శని,ఆది వారాల్లో మాత్రమే రాత్రి తొమ్మిది గంటలకి ఒక పావు గంట మాత్రమే ఉంటది. ఆ కొంచెం సేపు వాహనాలు నిలిపి వేస్తారు.




ద నాంగ్ నగరం చాలా ప్రణాళిక బద్ధంగా కట్టబడినది. విశాలమైన శుభ్రముతో కూడిన రోడ్లు తక్కువ ట్రాఫిక్కుతో ప్రశాంతంగా ఉంది. కొంత వరకు వర్షం పడినా మాకు ఇబ్బంది కలగలేదు. భారతీయ ఆహరం ఇక్కడ కూడా దొరికింది. అక్కడి ఆహారంతో పోల్చుకుంటే ఇండియన్ రెస్టారెంట్లు కొంచెం ఖరీదు ఎక్కువ. మంచి నీళ్లు ఎక్కడ పట్టినా చాలా ఖరీదు. అందరికీ వియత్నాం ఒక పేద దేశం అనే అపోహ ఉంది. మన రూపాయికి ఎక్కువ విలువ ఉంటది అనుకుంటారు, కానీ అది ఏ మాత్రం నిజం కాదు. రెండు దేశాల కొనుగోలు శక్తి ఒకరకంగా సమానమే.
Day 4:
ఉదయం లేచి వియత్నాం యాత్రలో చివరి నగరమైన హనోయికి విఎట్రావెల్ విమానంలో బయలుదేరాం. ఇది వియత్నాం దేశ రాజధాని. అక్కడికి తొందరగా చేరుకోవడంతో హనోయి విమానాశ్రయానికి, నగరానికి 28 కిలోమీటర్లు ఉండడంతో క్యాబ్ లో కాకుండా బస్సు లో వెళదామని అనుకున్నాం. క్యాబ్ లో ఐతే వెయ్యి రూపాయలు పైగా తీసుకుంటే ఏసి బస్సులో మనిషికి కేవలం నలభై రెండు వేల డాంగ్లు (సుమారు 140 రూపాయలు). ఒంటరిగా ప్రయాణం చేసే వారికి వియత్నాం లో బైక్ టాక్సీలు చాలా చౌకగా దొరుకుతాయి . బస్సు దిగాక ఓల్డ్ క్వార్టర్స్ లో ఉన్న మా హోటల్ కి చేరుకోడానికి ఒక పది నిమిషాలు పట్టింది.

హో చి మిన్, ద నాంగ్ నగరాలు చుసిన తర్వాత హనోయి నగరం ఇరుకైన సందులలో అగ్గి పెట్టల్లా పేర్చిన ఇల్లు చుసిన ఎవరైనా వెనకబడిన దేశం అని అనుకుంటారు. హోటల్ గదులలో అన్ని సౌకర్యాలు ఉన్నా చాలా ఇరుకుగా ఉన్నాయి. మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కేవలం ఈ ఓల్డ్ క్వార్టర్స్ ప్రాంతం ఆలా ఉంటదని మిగతా నగరం బాగుంటది. పాత రోజుల్లో చుసిన రిక్షాలు కూడా ఇక్కడ దొరుకుతాయి, కానీ పర్యాటకుల దగ్గర చాలా అధిక మొత్తంలో వసూలు చేస్తారు. ఆ ప్రాంతం అంతా తిప్పి చూపిస్తారు. భోజనం అయ్యాక కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని టెంపుల్ ఆఫ్ లిటరేచర్ కు బయలుదేరాం. ఇది చైనా తత్వ వేత్త అయిన కన్ఫుషస్ కి అంకితం చేయబడినది. ఆయన జన్మస్థానం లో ఉన్న మందిరం లాగే ఐదు ప్రాంగణాలు ఉంటాయి. ఇక్కడే వెయ్యి ఏండ్ల నాటి వియత్నాం దేశంలోని మొట్ట మొదటి విశ్వవిద్యాలయం కూడా ఉంది. అక్కడ చదివిన విద్యార్థుల పేర్లు, వారు వాడిన పుస్తకాలు,కలములు అన్నీ ఉన్నాయి. అప్పట్లో పరీక్షల సరళి, ప్రశ్న పత్రాలు మరియు సూచనలు పొందు పరిచారు. సాహిత్యం, కవిత్వం, చైనా చరిత్ర మరియు తత్త్వం మొదలైనవి ఇక్కడ బోధించ పడినవి. చైనాకు ఈ నగరం దగ్గర ఉండడం వలన కాబోలు వారి సంస్కృతి, ఆచారాలు కనిపిస్తూ ఉంటాయి.





తరువాత హో చి మిన్ సమాధి ఉన్న స్థలానికి వెళ్ళాం కానీ అప్పటికే మూసివేసి ఉంది. అక్కడ నుంచి అంతర్జాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ట్రైన్ స్ట్రీట్ కు వెళ్ళాం. లోపల ఉన్న కేఫ్ లలో త్రాగే వారికి మాత్రమే లోపలి ప్రవేశం. కానీ మేము ఆ ట్రైను వచ్చే సమయానికి అక్కడికి వెళ్లి చాలా దగ్గర నుండి చూసాం. లోపలికి జనాలు పోకుండా అడ్డు పెట్టి ఉంచారు. ఆ తరువాత నైట్ మార్కెట్ లో ఆలా తిరిగి రోజుని ముగించాం.



Day 5:
మా వియత్నాం పర్యటన దాదాపు ముగింపుకి వచ్చింది. మేము ఉన్న హోటల్ లోనే ఈరోజు అల్పాహారం చేశాం. విదేశీయులు తినేలా అన్నీ దొరికాయ్. రుచికరంగా కూడా ఉన్నా శాఖాహారులకి చాలా తక్కువ ఉన్నాయి. మా చివరి మజిలీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతమైన హలోంగ్ బే. పర్యాటకులతో ఎప్పుడు కిక్కిరిసి ఉండే ఈ ప్రాంతం పేరు “దిగివస్తున్న డ్రాగన్” నుంచి వచ్చింది. అక్కడి వారి పురాణాల ప్రకారం శత్రువుల నుండి వారిని కాపాడడానికి డ్రాగన్లు ఆకాశం నుండి భూమికి దిగి వచ్చి వాటి నోటి నుండి ముత్యాలు, రత్నాలు రాలగా కాలక్రమంలో దీవులుగా రూపాంతరం చెందాయి.

హ లాంగ్ ఖాతం హనోయి నగరం నుండి ఎక్సప్రెస్ వే మీద మూడు గంటల ప్రయాణం. ఆ రోడ్డు చాలా బాగా ఉన్నది మరియు మధ్యలో విరామానికి ఒక పది నిమిషాలు ఆపారు. తర్వాత ఓడ రేవుకి దగ్గర్లో ఉన్న ముత్యాల పెంపకం జరిగే దగ్గర ఆపారు . చాలా సున్నితమైన ముత్యాల సాగుని మాకు చూపించారు. మనకి మార్కెట్లో దొరికే దాదాపు అన్నీ ఇలా సాగు చెయ్యబడినవే. ప్రకృతిలో చాలా అరుదుగా దొరుకుతాయి మరియు చాలా ఖర్చు ఉంటది. ముత్యాల ఆకారం,రంగు,మెరుగు బట్టి వివిధ రకాలుగా గ్రేడింగ్ చెయ్యడం చూపించారు. పక్కనే ముత్యాల నగలు అమ్మకానికి పెట్టారు కానీ చాలా ఖర్చు ఉన్నవి. మధ్యాహ్నానికి మేము ఓడరేవు చేరుకున్నాం.

క్రూజ్ లో ఎక్కగానే భోజనం పెట్టారు. కానీ మేము తినేలా అసలు లేవు. మేము తినలేక మధ్యలోనే లేచి ఖాళీ
గా ఉన్న పై అంతస్తుకు వెళ్ళాం. అలా సముద్రంలో చిన్న చిన్న దీవులు వస్తా ఉండగా, సంద్రపు గాలి తాకుతా ఉండగా, నీలం రంగుతో నిండి ఉన్న సముద్రం, ఆకాశాన్ని చూస్తూ సేద తీరచ్చు. మొదటిగా లువాన్ గుహ దగ్గర ఆపారు. అక్కడ కయాకింగ్ కానీ వెదురు పడవల (ఒకప్పుడు వెదురు వాడేవారు) రైడ్ కానీ చెయ్యచ్చు. మేము కయాకింగ్ చేశాం. ఆ అనుభవం మాత్రం మర్చిపోలేనిది. సున్నపు రాతి కొండను ఎన్నో లక్షల ఏళ్ళు సముద్రపు నీరు తాకి ఒక గుహలా ఏర్పడింది. ఆ చిన్న గుహలో నుండి వెళ్తే చుట్టూ కొండల వల్ల ఏర్పడిన ఒక సరస్సు ఉంది.

తర్వాతి మజిలీ సుంగ్ సోత్ గుహ. ఇది ఒక పక్కన క్రూజ్ మనల్ని వదిలేసి ఇంకొక పక్క ఎక్కించుకుంటది. ఒకసారి లోపలికి వెళ్తే వెనక్కి తిరిగి రావడం ఉండదని ముందుగానే హెచ్చరించారు. లక్షల ఏళ్ల నుండి అలా సున్నపు నీరు కారుతా ఈ అద్భుతం ఏర్పడింది. లోపల చూడగానే విశాఖపట్నం దగ్గర్లో ఉన్న అరకులో బొర్రా గుహలు గుర్తుకు తెస్తాయి. చాలా కష్టపడి నడిచి ఎక్కినందుకు పై నుంచి హ లాంగ్ ఖాతం అద్భుతంగా కనిపించింది.



చివరగా టి టాప్ దీవికి వెళ్ళాము. భూ కక్ష్యలో ప్రవేశించిన రెండవ మానవుడైన రష్యన్ వ్యోమగామి టిటావ్ అప్పట్లో హో చి మిన్ తో కలిసి ఇక్కడికి వచ్చారంట. ఆయనకు ఈ దీవిని అంకితం చేస్తూ దీని పేరు పెట్టబడినది. కావాలి అనుకున్న వాళ్ళు కొండ పైకి ఎక్కచ్చు. ఇంకొందరు ఆలా సముద్ర తీరంలో సేద తీరారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం మొదలైంది. నలువైపులా సముద్రం, గుట్టల మధ్యలో సూర్యుడి అస్తమయం చూస్తుంటే వేరే ప్రపంచంలో అడుగు పెట్టామా అన్నట్లు ఉంది. ఆలా డ్రాగన్ల ఖాతానికి వీడ్కోలు చెప్పి తరువాత రోజు నుంచి పాత జీవితానికి వెళ్లాలని మమ్మల్ని మేము ఓదార్చుకున్నాం.



Day 6:
అలా బైక్ టాక్సీపై జేడ్ టెంపుల్ వైపు నుండి వెళ్తా వియత్నాం గుర్తుగా కొన్ని వస్తువులు తీసుకున్నాక చివరగా వియత్నాం దేశానికి వీడ్కోలు పలుకుతూ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాం.
మెకాంగ్ డెల్టా, ఫూ కాక్, మార్బల్ పర్వతాలు, సాపా లాంటివి సమయం లేక చూడలేక పోయాం. తోటి ప్రయాణకుల దగ్గర నుండి మంచి అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలాయి. ఆహరం విషయంలో కొంచెం ఇబ్బంది పడినా ఎక్కడికి వెళ్లినా మన భోజనం దొరకాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యాత్ర ఒక చక్కటి అనుభూతి కల్పించింది. మా మొట్ట మొదటి విదేశీ యాత్రలా వియత్నాంకు మా హృదయాల్లో ప్రత్యేకంగా ఎప్పటికి నిలిచిపోతుంది 🧡. ఇలా రానున్న రోజుల్లో ఇంకా ఎదిగి ఎన్నో దేశాలు చూడాలని ఆశిస్తూ… ఇక సెలవు.