మలేషియా దేశం కేవలం మలేయ్ జాతి మరియు స్థానిక తెగలే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన జాతులైన భారతీయులు మరియు చైనీయుల కలయిక. వారి పర్యాటకశాఖ నినాదం అయిన “సిసలైన ఆసియా” అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పడమర వైపున అండమాన్ సముద్రం/మలక్కా జలసంధి మరియు తూర్పు వైపున దక్షిణ చైనా సముద్రం కలిగి ఉన్న ద్వీపకల్పమైన మలేషియా (పడమర మలేషియా) నా తదుపరి గమ్యం. పోయిన వియత్నాం పర్యటనలో మలేషియా విమానాశ్రయం చూసే అవకాశం కలిగింది. ఇప్పుడు ఆ దేశం పర్యటించే అవకాశం వచ్చింది. ఆగ్నేయాసియా దేశాల సమూహం అయిన ఆసియాన్ దేశాల నట్ట నడుమున ఉన్న ఈ దేశం ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలతో భూమి/సముద్రం సరిహద్దు కలిగి ఉన్నది.
Day 1:
ఈ యాత్ర లో నా మొదటి మజిలీ, లంగ్ కావి – కేడా రాష్ట్రపు ఆభరణం మరియు 99 దీవులు కలిగిన ఒక ద్వీపసమూహం. సముద్రం ద్వారా థాయిలాండ్ దేశానికి అతి దగ్గరలో ఉన్నది. తెల్లవారుజామున బెంగళూరు నుండి బయలుదేరి నాలుగు గంటల విమాన పయనం తర్వాత మలేషియా సమయం సుమారు పదకొండు గంటలకు చేరుకున్నాం. ఈ విమానాశ్రయంలో నేలపై వాలుతుండగా ఒక పక్క సముద్ర తీరం, పదుల సంఖ్యలో ద్వీపాలు ఎంతో చక్కటి దృశ్యం. ఎక్కువ జన తాకిడి లేని విమానాశ్రయం కావడం వలన లాంఛనాలు అన్ని త్వరగా ముగించుకుని ఇబ్బందులు ఏమి లేకుండా దేశంలోకి అడుగుపెట్టాము. వారం రోజులకు అపరిమిత డేటా మరియు కాల్స్ కలిగిన పర్యాటక సిమ్ కార్డు కేవలం మూడు వందల రూపాయలకు దొరికింది.


లంగ్ కావిలో ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉన్న ప్రదేశాలలో ఒకటైన పంటాయి సెనంగ్ (పంటాయి అనగా రేవు) లోనే మా బస. కానీ మా హోటల్ పరిసరాలు పర్యాటకుల తాకిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నది. మొత్తంగా చూసుకుంటే ఈ దీవిలో తక్కువ జనాభా మరియు కట్టడాలు ఉండడం కారణాన పచ్చటి ప్రకృతి ఒక పక్క, నీలి సముద్రం ఇంకొక పక్క కన్నుల విందుగా ఉన్నది. మధ్యాహ్నం ఒక ఇండియన్ రెస్టౌరెంట్ లో భోజనం చేసాం. పేరుకి భారతీయత ఉన్నా అక్కడి రుచులు తగులుతూనే ఉన్నాయి. మలేషియా మరియు పొరుగు దేశమైన ఇండోనేషియా లో ప్రసిద్ధి చెందిన నాసి గోరెంగ్ ను(ఫ్రైడ్ రైస్ మీద వేయించిన గుడ్డు) రుచి చూసాము. ఈ దీవిలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అక్కడి హోటల్స్ లో మధ్యాహ్నం మూడు గంటలకి చెక్ ఇన్ చేస్తే మరునాడు పన్నెండు గంటలకే చెక్ అవుట్ చెయ్యాలి. త్వరత్వరగా పనులు ముగించుకుని సూర్యాస్తమయానికి క్రూజ్ కు బయలుదేరాం.

లంగ్ కావి జిల్లా రాజధాని అయిన కుఆహ్ లోని ఈగల్ స్క్వేర్ నుండి క్రూజ్ బయలుదేరింది. ఫెర్రీ ద్వారా మలేషియా భూభాగం లేదా ఇతర దీవులు నుండి వచ్చేవారికి ఈ ప్రాంతమే ప్రవేశ ద్వారం. లంగ్ కావి అనే పేరు ఆ గ్రద్ద నుండే వచ్చింది, అందుకు చిహ్నంగా అక్కడ దాని ప్రతిమ ప్రసిద్ధి. దిగ్మండలంలో సూర్య కిరణాలు చొచ్చుకురాగా ముదురు నీలం రంగులో సోయగాలు పలుకుతున్న మలక్కా జలసంధి లో మా క్రూజ్ చీల్చుకుంటూ ముందుకు సాగింది. గర్భం దాల్చిన ఒక యువతి రూపం లో ఉన్న ఒక దీవిని దాటుకుంటూ ముందు వెళ్ళాం. ఆ దీవిలో సముద్రపు నీరుతో కలవని ఒక మంచి నీటి సరస్సు కలిగి ఉన్నది. మా ఆలస్యం వలన సముద్రపు నీటిలో దిగే అవకాశం కోల్పోయాం. అలాగే కాల పరిమితి దృష్ట్యా మరిన్ని దీవులు చూడలేకపోయాం. ఇక్కడ ఐలాండ్ హోపింగ్ కు (ఒక దీవి నుండి ఇంకొక దీవికి స్పీడ్ బోట్ లో వెళ్ళుట) చాలా పేరు గాంచింది . ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ ప్రదేశం లో రాత్రి ఎనిమిది గంటలు అయినా వెలుతురు పగలు లాగే ఉన్నది. క్రూజ్ లో భోజన సౌకర్యం ఉన్నా ఏమాత్రం బాగాలేదు. తిరిగి వచ్చాక తినడానికి హోటల్ వెతికే పని తప్పలేదు.




Day 2:
సముద్రతీరానికి ఆనుకుని ఉన్న హోటల్ కావడంతో ఉదయం లేవగానే ఆలా తీరం వైపుకి నడుస్తుంటే పొగ మంచుతో కప్పబడిన మైదానం పలకరించింది. సూర్యుడు దాగుడు మూతలు ఆడుతున్నట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ సముద్ర తీరంలో ఆలా కొంత సేపు సేద తీరి అల్పాహారానికి బయలుదేరాం. కొంత వరకు వారి ప్రాంతీయ రుచులు కొన్ని కాంటినెంటల్ రుచులతో అల్పాహారం ముగిసింది. ఆ తరువాత గునుంగ్ మాచించాంగ్ అనే కొండ ప్రాంతానికి బయలుదేరాం. అక్కడ పైకి చేరుకోడానికి కేబుల్ కార్ మార్గంలో లోయల హంగులు మరియు సముద్రంలో చిన్న చిన్న దీవులు మైమరిపించేలా అనుభూతి కల్పించింది. పైకి చేరుకున్నాక కొంత వరకు నడక మార్గంలో కొండని దిగితే ఎంతో పేరుగాంచిన ఆకాశంలో వారధి (స్కై బ్రిడ్జి) ప్రత్యక్షమవుతుంది.


సముద్ర మట్టానికి రెండువేల అడుగుల ఎత్తులో ఉండడం వలన ఆ వారధి పైన చల్లటి గాలి వీస్తూ మనసుని పులకరింపు చేస్తుంది. ఆ పైనుండి చూస్తే ఎన్నో ఛాయలు కలిగిన నీలి సముద్రం కళాకారుని వ్రేళ్ళ నుండి జాలువారిన ఒక చక్కని చిత్రమలే ఉన్నది. ఆ అనుభూతి ఎంతో సేపు మిగలలేదు. కేబుల్ కార్ వద్దకి చేరుకోడానికి శ్రమించక తప్పలేదు. తిరిగి బేస్ స్టేషన్‌కు చేరుకున్నాక స్కై రెక్స్ మరియు స్కై డోమ్ రెండూ మూసేసి ఉండడం చూసి నిరాశపడ్డాం. ఇక చేసేది ఏమీ లేక ౩డి కళాకృతులను చూడడానికి వెళ్ళాము, చిత్రవిచిత్రమైన కళలకు కొలువు ఇది. సాయంత్రానికి హోటల్‌కు చేరుకొని మరింత సేపు సముద్రంలో, కొంత సేపు ఈత కొలనులో సేద తీరాము. ఇక్కడి సముద్రం అలలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉన్నది. పక్క పక్కనే ఉన్న దీవుల వలన కాబోలు.


రాత్రికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే జాలన్ పంటాయి సెనంగ్ మా అడ్డా (జాలన్ అనగా వీధి/రోడ్డు). ఆ వీధిలో ఒక కూడలి దగ్గర జూసీ క్రిస్పీ బర్గర్లు రుచి చూసాం. ఈ లంగ్ కావి దీవి పన్నులు లేని దుకాణాలకు పేరు. దాంతో అక్కడే ఉన్న వ్వారిసన్ దుకాణంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి అంతటితో రోజు ముగిసింది.

Day 3:
చివరికి లంగ్ కావికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. మా తదుపరి మజిలీ కౌలాలంపూర్. మధ్యాహ్నం విమానం ఎక్కగానే సరిగ్గా నలభై నిమిషాలకే లాండింగ్ కు సిద్ధం అయింది. విమానంలో నుండి చూస్తే అందంగా అమర్చిన అట్టపెట్టల్లా విల్లాలు, వాటి చుట్టూ ఆయిల్ పామ్ చెట్లు అలంకరించినట్లు కనిపించాయి. మలేషియా పొరుగు దేశమైన ఇండోనేషియా తరువాత పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నది. చౌక విమానయాన సంస్థ ఐన ఎయిర్ ఆసియా ముఖ్య కేంద్రమైన రెండవ టెర్మినల్‌లో ల్యాండ్ అయ్యాం. వారి నినాదం అయిన “Now everyone can fly” వారి కార్యాచరణలో కూడా రుజువు చేస్తున్నారు. వరుసలో నిలిపిన పదుల సంఖ్యలో ఉన్న ఎయిర్ ఆసియా విమానాలు మమ్మల్ని స్వాగతించాయి.
కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆశ్చర్యంగా, వారి పరిపాలన రాజధాని అయిన పుత్రజయ నగరం విమానాశ్రయానికి దగ్గరలోనే ఉన్నది. రెండు దశాబ్దాల కిందట పరిపాలన రాజధాని మరియు అంతర్జాతీయ విమానాశ్రయం రెండూ కౌలాలంపూర్ నగరంలోనే ఉండేవట. నగరానికి వెళ్లే దారిలో కడై మామ హోటల్‌కి వెళ్ళాం. ఈ రకం హోటళ్లు తమిళనాడు నుండి వలస వచ్చిన భారతీయ ముస్లింలు నడుపుతుంటారు. మొత్తానికి మన రుచులకు కొంచెం దగ్గరగా ఉండడంతో ఉపశమనం పొందాము.
భారతదేశం నుండి వలస వచ్చిన తమిళ ముస్లిం వర్తకులచే పరిచయం చేయబడిన ప్రసిద్ధ వంటకం నాసి కంధార్. అన్నంతో పాటు దాని మీద రకరకాల శాఖాహార/మాంసాహార కూరలు వేసి ఇస్తారు. ఆ మాంసాహార కూరల గుజ్జు (గ్రేవీ) అన్నం మీద పులుసులాగా పోస్తారు. నాసి అంటే మలాయ్ లో అన్నం మరియు కంధార్ అనగా భుజాలపై. ఒకప్పుడు వలస వచ్చిన తమిళ ముస్లిం వర్తకులు వారి భుజాలపై కావడిలాగా ఈ వంటకాన్ని మోస్తూ అక్కడి నౌక నిర్మాణ కేంద్రాలలో పని చేసే కార్మికులకు అమ్మేవారు. అలా కాలక్రమేణా ఇప్పుడు అన్ని ప్రముఖ హోటళ్లలో ప్రసిద్ధ వంటకంగా రూపాంతరం చెందింది. మనకు మాంసాహార కూరలు కావాలంటే అవి,లేదు శాఖాహారం కావాలి అంటే బెండకాయ, కాకరకాయ వేపుడు, క్యాబేజీ ఆలా మనకి కావాల్సిన వాటిని తీసుకోవచ్చు. దానికి తగ్గట్లే డబ్బులు వేస్తారు. అక్కడ బాగా ఆదరణ పొందిన వంటకం కావడంతో చవకగానే దొరుకుతుంది.

ఒకప్పుడు మలాయ్ ద్వీపఖండం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం అవ్వడంతో చాలా మంది భారతీయుల్ని అక్కడ తోటలలో సాగుకి, రైలు మార్గాలు నిర్మించడానికి కూలీలుగా తీసుకువెళ్లారు. అలాగే చైనా దేశం నుండి టిన్ గనులలో కార్మికులుగా తీసుకువెళ్లారు. అక్కడి స్థానికులైన భూమిపుత్రులు, చైనా నుండి వలస వెళ్లిన చైనీయుల తర్వాత భారతీయులు మూడవ స్థానంలో నిలిచారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం చోళులు, అశోకుని, శ్రీ విజయుని కాలంలోనే భారతీయులు అక్కడికి వలస వెళ్లినా, బ్రిటిష్ వారి కాలంలో జరిగిన వలస ఎంతో ముఖ్యమైనది. ఎన్నో మలాయ్ పదాలలో సంస్కృత పదాలే దానికి రుజువు. అలాగే అక్కడ హిందూ మరియు బౌద్ధ సంప్రదాయాలు మన ఉపఖండం నుండి శతాబ్దాల క్రిందట వలస వెళ్లాయనే విషయం విదితమే.
ఆ నగరంలో పగలూ రాత్రి తేడా లేడకుండా ఎప్పుడూ కోలాహలంగా ఉండే ప్రాంతం ఐన బూకిట్ బింటాంగ్ (బూకిట్ అనగా కొండ) లోనే మా బస. అలా కొంచెం షాపింగ్ కు బయలుదేరుదాం అనుకునే లోపే కుంభ వృష్టి కురిసింది. ఈ ప్రాంతం ఉష్ణమండల ప్రాంతం కావడంతో రుతుపవనాల తాకిడి కారణాన ఏ నిమిషమైనా వర్షం పడే అవకాశం ఉంటది. ఈ నగరం మేఘాలను తాకే ఆకాశ హర్మ్యాలతో నిండి ఉన్నది. మెర్డేక 118 అనే 118 అంతస్తుల భవనం మాకు చాలా దగ్గర్లో ఉన్నది. బుర్జ్ ఖలీఫా తరువాయి స్థానంలో ఇది ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన ఆకాశ హర్మ్యం. కానీ ఈ భవనం లోకి వెళ్ళడానికి సామాన్య ప్రజలకి ఇంకా అనుమతి లేదు.



మా షాపింగ్ కు ముందుగా సెంట్రల్ మార్కెట్‌కు వెళ్ళాం. ఆ తరువాత పెటలింగ్ వీధి (వాడుకలో చైనాటౌన్) లో బాంగ్లాదేశ్, చైనా, ఇండియా నుండి తీసుకువచ్చిన నకిలీ/అనుకరణ వస్తువులు దొరుకుతాయి. వాటి ధరలు, నాణ్యత చెప్పుకోదగినవి కావు. రాత్రి భోజనానికి మామా హోటల్‌కు వెళ్లి అక్కడే రోటి చెనాయి రుచి చూసాము. మన దగ్గర దొరికే సీలోనూ/కేరళ పరోటానే ఈ రోటి చెనాయి. అందులో నంజుకోవడానికి పప్పు కానీ ఏదైనా మాంసం కూర దొరుకుతుంది. తరువాత అలా కిక్కిరిసిన బూకిట్ బింటాంగ్ వీధులలో తిరుగుతూ అక్కడి ఫాస్ట్ ఫుడ్ దుకాణాలను చూసి నిద్రాదేవి ఆవహిస్తే రోజుకి ముగింపు పలికాము.





Day 4:
అక్కడ ప్రసిద్ధి చెందిన కడై మామక్ హుసిన్ లో దక్షిణ భారతీయ అల్పాహారం తీసుకున్నాక కౌలాలంపూర్‌కు దక్షిణాన ఉన్న ఆధునిక నగరమైన పుత్రజయకు బయలుదేరాం. ఇప్పటికి కౌలాలంపూర్ అధికారిక రాజధాని మరియు శాసనసభ కలిగి ఉన్నా, జనాభా మరియు రద్దీ దృష్ట్యా పరిపాలన రాజధాని, అత్యున్నత న్యాయ స్థానం రెండూ పుత్రజయకు తరలించారు. ఇది ఒక సంస్కృత పదం మరియు వారి మొదటి ప్రధాన మంత్రి పేరు కలిసేలా పెట్టబడినది. ప్రధాన మంత్రి అధికార నివాసం అయిన పెరదాన పుత్రకు వెళ్లే దారంతా ఇంద్ర భవనాల లాగా ఒక్కో మంత్రిత్వ శాఖ భవంతులు నిలుచున్నాయి. అక్కడికి దగ్గర్లోనే పుత్ర స్క్వేర్ లో గులాబీ మరియు రోజా రంగులో గ్రానైట్ సోయగాలతో ఉన్న పుత్ర మసీదు దర్శనం ఇస్తుంది.పైన గుమ్మటం ఆకారం, స్థంభం మరియు సంక్లిష్టమైన పూల ఆకృతులు అన్ని భారతదేశంలోని ఇస్లాం నిర్మాణ శైలిని తలపించేలా ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న కొలనుని ఆనుకుని ప్రధానమంత్రి భవనం చూడచక్కని దృశ్యంలా ఉంది.










అన్ని సౌకర్యాలు, పక్కా ప్రణాళికతో భవిష్యత్తు తరాల కోసం నిర్మించిన నగరం నుండి మా ప్రయాణం యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన మేలకా/మలక్కా వైపు సాగింది. దారిలో నావ ఆకారంలో ఉన్న సేరి వావాసం వంతెన కనిపించింది. మేలకా నగరం గొప్ప నౌకా వాణిజ్య వారసత్వానికి చిహ్నం. ఒకప్పుడు ఈ నగరం మలక్కా జలసంధిలో తిరుగులేని వ్యాపార కేంద్రం. ఆ జలసంధి పేరు కూడా ఒకప్పటి సల్తనత్ ఉన్న నగరం పేరు నుండే వచ్చింది. కాల క్రమంలో డచ్, పోర్చుగీస్ చివరగా బ్రిటిష్ వారి చేతిలోకి అధికారం మారుతూ వచ్చింది. మొదటిగా పోర్చుగీస్ కోట అయిన ఆ ఫేమోసను చూడడానికి వెళ్ళాం. చుట్టూ ప్రహరీ గోడ మాత్రమే ఉంది ఆ కోట శిథిలావస్థకు చేరుకుంది. ఆ నిర్మాణ శైలి పాత గోవాలోని కోటలను గుర్తుచేసింది.



మలక్కా నది ఈ నగర మధ్యలో నుండి ప్రవహిస్తూ రెండూ భాగాలుగా చేస్తుంది. అలా నదిలో క్రూజ్ మీద ముందుకు కదులుతుంటే నదికి ఆనుకునే రంగు రంగుల మేడలు అందమైన అనుభూతుని కల్పిస్తాయి. అక్కడి వారసత్వ సంపదను మలయ్ మరియు ఆంగ్లములో చెప్తున్నా సరిగ్గా వినపడలేదు. ఆ దేశంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మగవారికి ఆడవారికి తేడా లేకుండా అనేక వృత్తులలో ఇద్దరూ రాణిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుండి స్వతహాగా పడవ నడిపే వారి వరకూ అన్నిట్లో ఆడవారు తామేమి తీసిపోము అన్నట్లు రాణిస్తున్నారు. మన దేశంలో ఆడవారు కొన్ని వృత్తులలో రాణిస్తున్నా ఇప్పటికీ చాలా వృత్తులు మగవారికే పరిమితం.


కౌలాలంపూర్ తిరుగు ప్రయాణంలో మేము ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా అక్కడివారు క్రమశిక్షణ చూసి ముచ్చటేసింది. వారి హైవేలపై 7-ఎలెవన్ లాంటి బహుళ జాతి సంస్థలేగాక KK సూపర్ మార్ట్ లు (కొంచెం చవక) కనిపిస్తుంటాయి. వీటిలో శుభ్రంగా విశ్రాంతి గదులే గాక ప్రార్ధన గదులు కూడా ఉంటాయి. అక్కడ 7-ఎలెవన్‌లో ఎటిఎంలు ఉన్నా వాటిని అత్యవసరం ఐతే తప్ప వాడద్దని నా సలహా. వాటి బదులుగా ఎటువంటి అధిక వసూళ్లు లేని మే బ్యాంకు లేదా ఇస్లామిక్ బ్యాంకులు అయిన CIMB లేదా హొంగ్ లియాంగ్ లో డబ్బులు తీసుకోవడం ఉత్తమం. నగరానికి చేరుకున్నాక అక్కడ స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి జెండా ఎగురవేసిన కూడలి అయిన మెర్డేక స్క్వేర్ కి వెళ్ళాము. మెర్డేక అనగా స్వాతంత్య్రం. దానికి ఎదురుగానే సుల్తాన్ అబ్దుల్ సమాద్ భవనం ఉన్నది. ఇది ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్య అధికార కార్యాలయం. కాలక్రమంలో అదే భవనం అత్యున్నత న్యాయస్థానంగా పుత్రజయకు తరలించేవరకు కొన్ని సంవత్సరాలు ఉన్నది. ఆ దగ్గర్లోనే రెండు నదుల (క్లాన్గ్, గోంబేక్)సంగమం అయిన రివర్ అఫ్ లైఫ్ ఉన్నది. రాత్రి మామా హోటల్లో తిని, అలా కొంచెం సేపు బూకీట్ బింటాంగ్ వీధులలో తిరగడంతో మా రోజు ముగిసింది.





Day 5:
ఈ రోజు మా మొదటి మజిలీ ఇస్తాన నెగారా – మలేషియా మహారాజు అధికార నివాసం. మన దేశంలో రాష్ట్రపతి లాగ అక్కడి రాజు కేవలం నామమాత్రపు అధికారి మరియు సర్వోన్నత పదవి కలవాడు. ఆ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల సుల్తాన్ల నుండి ఒకరి తర్వాత ఒకరు దేశానికి రాజుగా ఎన్నిక అవుతారు. ఇప్పుడు ఉన్న రాజు సింగపూర్ దేశం పక్కనే ఉన్న జోహోర్ రాష్ట్ర సుల్తాను.

తరువాత మేము ఎంతో ప్రసిద్ధి చెందిన బాతు గుహలకి వెళ్ళాము. ఇక్కడే ఎంతో పేరు పొందిన నూట నలభై అడుగుల మురుగన్ విగ్రహం ఉన్నది. పక్కనే నిటారుగా ఉన్న మెట్లు ఎక్కితే గుహల సముదాయం చేరుకుంటాము. అక్కడే శ్రీవల్లి, దేవైనాయి అమ్మవార్ల గుడితో పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉన్నది. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఆ సున్నపు రాతి నుండి బొట్టు బొట్టుగా కాల్షియమ్ లవణాలు రాలి ఏర్పడిన స్తాలగ్మైట్లు, స్టాలక్టైట్లు, ఆ గుహలో ఆకాశం కనిపించేలా ఒక కన్ను అబ్బురపరిచాయి.



ఆలా ఈరోజుకి మా తదుపరి మజిలీ అయిన గెంటింగ్ హైలాండ్స్ కు బయలుదేరాము. పైకి చేరుకోవడానికి రెండు కేబుల్ కార్ మార్గాలు ఉన్నాయి. గోహ్టోన్గ్ జయ అనే కేబుల్ కార్ అప్పట్లో ఆగ్నేయాసియా లోనే పొడవైన కేబుల్ కార్. మేము ఇంకొకటి ఐన ఆవానా కేబుల్ కార్ గుండా పైకి వెళ్ళాం. అది ఎక్కడానికి మాకు గంట సేపు పట్టింది, సెలవు రోజు కాకపోయినా అంత పర్యాటకుల తాకిడి చూసి ఆశ్చర్యం వేసింది. పొగ మంచు మధ్యలో చల్లటి వాతావరణంలో కేబుల్ కార్ ప్రయాణం మరపురానిది. లాంగ్ కావిలోని కేబుల్ కారుతో పోలిస్తే నూటికి నూరుపాళ్ళు అద్భుతంగా ఉంది. అక్కడేమో ఎండ ఆవిరి, ఇక్కడేమో చల్లటి చిరుగాలి. పైకి చేరుకున్నాక అక్కడ రకరకాల విలాస దుకాణాలు మరియు రెస్టౌరెంట్లు. పిల్లలు ఆడుకునేలా అవుట్ డోర్ మరియు ఇన్ డోర్ థీమ్ పార్కులు. బాగా సంపాదించి వృద్ధాప్యములో ఉన్న పెద్దవారు డబ్బులు వెదజల్లడానికి కేసినో ఇదొక కృత్రిమ ప్రపంచంలా ముందు చుసిన వాటికి భిన్నంగా ఉన్నాయి.





సమయ పరిమితి కావడం వలన దిగువ ప్రయాణంలో మిడ్ స్టేషన్ వద్ద ఉన్న భౌద్ధ మందిరం చూడకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ చివరి నిమిషంలో కేబుల్ కార్ జోరు అందుకుంటున్న సమయంలో అందరం ఒకేసారి దిగేసాం. దిగేసాక చుస్తే ఆ గుడికి వెళ్ళడానికి చాలా దిగాలి. మొదట చూసి మెట్లు ఉంటాయి అనుకుని భయపడుతూనే వెళ్ళాం, కానీ అక్కడ చుస్తే ఒకటి తర్వాత ఒకటి ఎస్కలేటర్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఉపశమనం కలిగింది. ఆ ప్రదేశానికి చేరుకున్నాక ఇక్కడ కనుక దిగకుండా ముందుకు వెళ్లుంటే కచ్చితంగా పశ్చాత్తాప పడే వాళ్ళమేమో. అక్కడ వాతావరణం, పగోడా, బుద్ధ విగ్రహం భూలోక స్వర్గం లాగా మరో ప్రపంచంలో అడుగు పెట్టినట్లు ఉన్నది.






నగరానికి తిరిగి వచ్చాక కౌలాలంపూర్ కే తలమానికమైన పెట్రోనాస్ జంట టవర్స్ (అక్కడ వాడుకలో KLCC) చూడడానికి వెళ్ళాం. ప్రపంచం లోనే అతి ఎత్తైన కట్టడంగా కొన్ని సంవత్సరాలు ఏలింది. ఇది ఎంత ప్రాముఖ్యత చెందింది అంటే ఆ నగరానికి చిహ్నంలాగా అందరి మదిలో నిలిచిపోయింది. వెన్నెలలో శ్వేత వర్ణపు సోయగాలతో ఆకాశంలో తారామండలంలా మిణుకు మిణుకుమంటూ మనసుని పులకరించే అనుభూతిని కల్పించింది. సాయంత్రం సమయంలో పక్కనే ఫౌంటెన్ లో లైట్ షో ఉంటుంది. హోటల్‌కు తిరుగు ప్రయాణంలో కంపున్గ్ బారు అనే ప్రదేశం దగ్గర ఆగాము. ప్రపంచంలోనే అతి విలువైన భూములలో ఒకటైన ఈ ప్రాంతం మలయ్ రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉండడమే గాక స్వాతంత్ర ఉద్యమానికి పురిటిగడ్డ.



Day 6:
మేము అనుకోకుండా తర్వాత రోజుకి KL టవర్ పైకి ఎక్కడానికి టికెట్ బుక్ చేసుకున్నాం. మా అదృష్టం కొద్దీ మమ్మల్ని పైకి వెళ్ళడానికి అనుమతించారు. ప్రపంచంలోనే అతి పొడవైన టెలీకమ్యూనికేషన్ టవర్లలో ఒకటి ఇది. సుమారు నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్న మేడపై నుండే చుస్తే నగరంలో ఉన్న ఆకాశ హర్మ్యాలు అద్భుతంగా కనిపించాయి. అక్కడే ఒక గ్లాసు డబ్బాలోకి వెళ్తే ఆకాశం మధ్యలో వేలాడుతున్న అనుభూతి కల్పిస్తుంది. ఇది చూసాక రెండు అంతస్తుల కింద ఉన్న ఆబ్సెర్వేషన్ డెక్ అంత గొప్పగా అనిపించలేదు. కాకపోతే అక్కడ అద్దాలు అడ్డు ఉండడంతో ఎటువంటి వాతావరణంలో అయినా నగరాన్ని చూడడానికి అవకాశం ఉంటది. అలాగే అక్కడే ఉన్న సూక్ష్మ దర్శిని లో నగరంలో ఉన్న ప్రతి చిన్న విషయం కనిపించింది. పెట్రోనాస్ టవర్, మెర్డేక 118 వాటి చుట్టు పక్కల పరిసరాలు అన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. మెర్డేక స్టేడియం, ఒకప్పటి అంతర్జాతీయ విమానాశ్రయం అన్నీ కనపడ్డాయి.


ఈ దేశం ఆర్ధికంగా ఇంత అభివృద్ధి చెందడానికి, ఆధునికతను చూడడానికి ఆ దేశ ప్రజలు ఒకరికి ఎప్పటికి రుణపడి ఉంటారు. ఆ దేశాన్ని దీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధాన మంత్రి డాక్టర్ మహాతిర్ మహమ్మద్. KL టవర్ మరియు పెట్రోనాస్ జంట టవర్లు రెండూ ఆయన పాలనలో మొదలు పెట్టినవే. లాంగ్ కావిలో పర్యాటకం ఇప్పుడు ఇలా ఉండడానికి కూడా ఆయనే దోహద పడ్డారు. పుత్రజయ నగరం కూడా ఆయన మానస పుత్రిక, ఒక దార్శనికుడు. పొరుగు దేశమైన అప్పటి సింగపూర్ ప్రధానమంత్రి అయిన లీ కుఆన్ యి కు సమకాలికుడు. ఆయన లాగే ఆసియా ఖండపు విలువలని చాటి చెప్పారు. 1996 లో ఆయన విజన్ 2020 సందర్భంగా ఒక టైం క్యాప్సూల్‌ని ఇక్కడే ఉంచారు. అందులో మలేషియా దేశ ఆశయాలు, ఒక అభివృద్ధి చెందిన దేశంలా చూడాలనే సంకల్పంతో కొన్ని వస్తువులు దాచారు. తన చేతుల మీదగానే తిరిగి ఆ టైం క్యాప్సూల్‌ని తీస్తానని ఆయన కూడా ఊహించలేదు. నేను ఇది రాసే సమయానికి కొన్ని రోజుల క్రితం ఆయన వంద సంవత్సరాలు దాటి ప్రపంచంలో అరుదైన వ్యక్తుల వరుసన నిల్చున్నారు.

మిగిలిన రోజు ప్లాజా లో యట్ అనే ఎలక్ట్రానిక్స్ మరియు IT వస్తువులు దొరికే షాపింగ్ మాల్లో, తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటైన బెర్జయ టైమ్స్ స్క్వేర్ కు వెళ్ళాం. అక్కడే KFC ఉంటే నాసి లెమక్ను రుచి చూసాము. అక్కడి వారు దాన్ని జాతీయ వంటకంగా భావిస్తారు. కీరా దోసకాయ, వేరు శనగలు, మిరపకాయ పచ్చడి, గ్రుడ్డు మరియు అన్నం ఇలా అన్నీ పోషకాల మిశ్రమం ఈ ఆహారాం.
చివరికి మలేషియాకు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమయింది. భిన్న జాతుల సమూహం మరియు భౌగోళిక వైవిధ్యం కలిగిన ఈ దేశం నిజంగా కాస్మోపాలిటన్ దేశాల జాబితాలో ఉంటది. పెనాంగ్ ప్రాంతం చూడలేదని చిన్న అసంతృప్తి. మలేషియా దేశంలో సముద్రానికి ఆవల ఉన్న బోర్నియో మలేషియా లేదా తూర్పు మలేషియా ఈ సారి తప్పక అన్వేషించాలని కోరుకుంటున్నా.
తదుపరి యాత్ర వరకు సెలవు….