రాత్రి గడియారం రెండు ముళ్ళు కలిసే సమయం ఆసన్నమైంది. చుట్టూ మాత్రం వెన్నెల సైతం అసూయ పడేలా విద్యుత్ కాంతులు. అక్కడక్కడా కొన్ని చీకటి గదులు రేయిని గుర్తుకు చేస్తున్నాయ్.అలా నడుస్తూ ఉండగా నా మొదటి మజిలీ మినీ క్యాంటీన్. అలుపెరగని జ్యూస్ మిక్సర్లు, కాఫీ మెషిన్లు జాబిల్లికి పగటి ని పరిచయం చేస్తున్నాయ్ కాబోలు. ఏం చెయ్యాలో తోచని వాళ్ళు, రకరకాల కారణాల వల్ల నిద్ర ని జయించడానికి వచ్చిన వీరులతో నిండి ఉన్న క్యాంటీన్ ని చూస్తూ ఆ ఘుమఘుమలు ఆస్వాదిస్తూ ముందుకు కదులుతూ ఉండగా పగలు దొరకని ప్రశాంతత, ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. పడీ పడని ఆ కాంతుల మధ్య వయసు మీద పడిన చెట్లు పరచిన తివాచి పై నడుస్తుంటే ఆ అనుభూతే వేరు.
ఏదో సాధించాలి అనే ఆత్మవిశ్వాసంతో వేసిన మొదటి అడుగులు కొన్ని తప్పటడుగుల వల్ల ఇంత దూరం వస్తాయని కలలో కూడా అనుకోలేదు.రెండు సంవత్సరాల కష్టం తర్వాత కూసంత కునుకు తీసుకుందామనే అలసత్వం ఈ దారిలో పెడుతుంది అని ఊహించనే లేదే. అలా మదిలో ఆలోచనలు మెదులుతూ ఉండగా చుక్కలు నేలకు తాకుతాయా అన్న రీతిలో మెరుస్తున్న రాజ్ పథ్. ఆ సమయంలో దాని మీద నడిచే సాహసం చెయ్యలేక అలా ముందుకు నడుస్తూ ఉండగా మరింత చీకటి లో నా మనసు సైతం మాయమైంది. జీవితం ఇదేనా? ఎం సాధించాం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు ,అనుభవాలు. ఎన్నో పరిచయాలు, మరెన్నో ప్రయాణాలు. జీవితం లో అద్భుతమైన కాలం ఇలాంటి పరిసరాల నడుమ గడపడం నిజంగా అదృష్టం. ఎన్నో నేర్పింది ఈ ప్రయాణం. భుజం తట్టి నడిపిన స్నేహం, ప్రేమ నేర్పిన పాఠాలు, నడకను సరిదిద్దిన బాధ్యతలు, సలహాలు…… ఇలా మరెన్నో.
ఆ అమాయకత్వం, కల్లాకపటం లేని నిర్మలమైన మనసు ఏ దరికి చేరిందో అర్ధం కాని అవివేకం.తప్పు జరుగుతుంది అని తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత, చేతగానితనం. రేపు ఎం కాబోతుందో ఏ మాత్రం సమాధానం లేని ఉదాసీనత. నా నడక లాగే మార్గం ఎరుగని గమ్యానికి ప్రయాణం అది. ఈ దారిలో పగలు గర్వంగా నడిచే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎన్ని రోజులు నుండి చూస్తున్నానో లెక్క లేదు. ఇన్ని రోజులు రేయి నన్ను కన్నబిడ్డలా చూసుకుంది. గర్వంగా తిరిగే రోజు కోసం నా ఈ నిరీక్షణ కొనసాగుతూనే ఉంటుంది.
ఆనందం పంచుకోవడానికి ఎందరున్నా బాధని పంచుకోవడానికి ఈ చెట్లు, చెట్ల మధ్య మార్గం, ఈ నిశ్శబ్దం, చీకటికి మించి ఇంకొకటి దొరకదు. నా లాంటి ఎందరిని హత్తుకుందో ఈ చీకటి. నేను ఈ రోజు ఉంటాను రేపు ఉండను. కానీ ఈ చీకటి, నిశ్శబ్దం,చెట్లు శాశ్వతం.
అలా చూస్తూ ఉండగానే ౧:౩౦ దాటింది. చిన్నగా విద్యుత్ కాంతులు మాయమవుతుండగా నిద్ర నన్ను ఆవహించింది.